కొట్లాట హీట్ పెంచిందా…?

ఎన్నో ఆటంకాలు, నిర్బంధాలు ఎదురైనా కొలువుల‌కై కొట్లాట స‌భ జ‌రిపి తీరింది టీజేఏసీ. నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్య‌లో హాజరై స‌భను విజ‌య‌వంతం చేశారు. విప‌క్ష పార్టీలు, ప్ర‌జా సంఘాలు టీజేఏసీకి మ‌ద్ధ‌తు తెలిపాయి. స‌భ స‌క్సెస్ తో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు ఒక చ‌ర్చ మొద‌లైంది.

స‌భ జ‌ర‌గ‌డానికి ఒక్క‌రోజు ముందు ఉస్మానియా యూనివ‌ర్శిటీలో విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం, విద్యార్థులు ఆందోళ‌న చేయ‌డం, పోలీసులు ఉక్కుపాదం మోపడం ఇవ‌న్నీ నిరుద్యోగ స‌మ‌స్య తీవ్ర‌త‌ను ప్ర‌భావితం చేశాయి. త‌రువాత మ‌రో నిరుద్యోగి కూడా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ఇలా ఒక‌దాని వెన‌క ఒక‌టి టీజేఏసీ డిమాండ్స్ లోని నిజాయితీని ప్ర‌తిబింబించాయి.

పోలీసుల ఓవ‌రాక్ష‌న్ నిరుద్యోగుల‌పై ప్ర‌భుత్వ వైఖ‌రిని అద్దంప‌ట్టాయి. స‌మైక్య పాల‌న‌లో కంటే దారుణంగా ప‌రిస్థితులు ఉన్నాయ‌నే ఫీలింగ్ అంత‌టా క‌లిగేలా చేశాయి. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌భుత్వానికి ఈ అంశాలు న‌ష్టం చేసేలా క‌నిపించ‌క‌పోయినా ఒక‌ర‌కంగా రాజ‌కీయంగా తెలంగాణ‌లో టీఆర్ఎస్ పార్టీకి న‌ష్టం క‌లిగించే ప‌రిణామాల‌కు దారితీస్తుంద‌నే చెప్పుకోవాలి..

తెలంగాణ ప్ర‌జ‌ల సంగ‌తి పక్క‌న‌పెడితే నిరుద్యోగులు, విద్యార్థుల్లో ప్ర‌భుత్వంపై ఒక‌ర‌క‌మైన భావ‌న క‌లిగించిందీ కొట్లాట స‌భ‌. ఒక‌ర‌కంగా టీజేఏసీ కొలువుల కొట్లాట స‌భ ఇటు ప్ర‌జ‌ల్లో కొంత అవ‌గాహ‌న క‌లిగించేలా చేయ‌డ‌మే కాకుండా అటు రాజ‌కీయంగానూ హీట్ పెంచేస్తోంద‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.