తెలంగాణ: పకడ్బందీగా కొత్త పంచాయతీరాజ్ చట్టం!
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ చట్టంలో మార్పులు చేస్తూ, కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పంచాయతీ ఎన్నికలు గడువులోగా జరిపి తీరుతామంటూ గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పంచాయతీ రాజ్ చట్టాన్నే అమలు చేస్తున్న నేపథ్యంలో అందులో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా చట్టం తీసుకురావాలనుకుంటోంది టీఆర్ఎస్ ప్రభుత్వం.
ఇందుకోసం పంచాయతీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్టారావు అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా దేశానికే ఆదర్శంగా చట్టాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోద ముద్ర వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.