ఆ అకౌంటెంట్ అద్భుతమైన నటుడయ్యాడు !

విజయ్ సేతుపతి.. పలు భాషల్లో నటిస్తూ జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. హీరో పాత్రలు చేస్తూనే విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. ఐతే, విజయ్ సేపతుపతి నేపథ్యం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయనకి ఎలాంటి సినీ నేపథ్యం లేదు. సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తమిళనాడులోని రాజపాళయంలో పేద కుటుంబంలో పుట్టాడు. విజయ్ నాన్న సివిల్ ఇంజినీర్. ఆయనికి అన్నయ్య, తమ్ముడు, చెల్లి ఉన్నారు.

బీకాం వరకు చదివిన విజయ్ సేతుపతి… ఆ తర్వాత కొన్నాళ్లు అకౌంటెంట్ గా పని చేశారు. ఐదారేళ్లు దుబాయ్ లోనూ పని చేసి వచ్చారు. ‘కూతుపట్టరై’ అనే ఓ థియేటర్ గ్రూపులో అకౌంటెంట్ గా పని చేశాడు. ఆ సమయంలోనే నటనపై ఆసక్తి కలిగిందట. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజుతో పరిచయం.. ఆయన దర్శకత్వంలో పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించడం ద్వారా గుర్తింపు తెచ్చుకొన్నాడు. సీరియల్స్ లోనూ కనిపించారు. ఓ సినిమా ధనుష్ పక్కన చిన్ని పాత్రలో చేశారు. పిజ్జా సినిమాతో విజయ్ సేతుపతికి బ్రేక్ దొరికింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ బాషల్లోనూ నటిస్తూ బిజీగా నటుడిగా కొనసాగుతున్నాడు విజయ్. నాకు ఎవరు పోటీ లేరు. నేను ఎవరికి పోటీ కాను. నాకు నేనే పోటీ అని చెబుతారు విజయ్.