ఆర్టీసీ ఛార్జీల పెంపు వాయిదా
ఆర్టీసీ బస్ టికెట్ ఛార్జీలు పెంచుకొనేందుకు కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కిలో మీటరుకు 22 పైసల చొప్పున పెంపునకు అనుమతిని ఇచ్చారు. తద్వార రూ. 750కోట్లు అదనపు ఆదాయం వస్తుందని సీఎం తెలిపారు. పెరిగిన ఛార్జీలు ఈరోజు (సోమవారం) నుంచే అమలులోనికి వస్తాయని తెలిపారు. ఐతే, ఛార్జీల పెంపు ఓ రోజు వాయిదా పడింది.
టికెట్ యంత్రాల్లో మార్పులకు ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉండడంతో అధికారులు వాయిదా వేశారు. పెరిగిన ఛార్జీలు డిసెంబర్ 3 నుంచి అమలులోకి రానున్నాయి. ఛార్జీల పెంపుపై అధికారులు కసరత్తు కొనసాగిస్తున్నారు. పెరిగిన ఛార్జీల పట్టికను అధికారులు ఈరోజు విడుదల చేయనున్నారు. ఇక ఆదివారం ఆర్టీసీ ఉద్యోగులతో ప్రగతి భవన్ లో జరిగిన ఆత్మీయ సమావేశంలో సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.
సమ్మెకాలంలో కార్మికులకి జీతాలు చెల్లిస్తామని చెప్పారు. అంతేకాదు.. ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుని 58 నుంచి 60కి పెంచుతామని తెలిపారు. ఆర్టీసీకి ప్రతి యేడాది బడ్జెట్ లో రూ. 1000కోట్లు కేటాయిస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులని వెంటనే పర్మినెంట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగుల విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. మహిళా ఉద్యోగులకి ప్రసూతి సెలవులు ఇవ్వాలని, రాత్రి 8గంటలలోపు వారిని ఇంటికి పంపించాలని సూచించారు.