ఎమ్మెస్కే’కు తెలివిగా చెక్ పెట్టిన దాదా

ఎమ్మెస్కే ప్రసాద్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అందుకున్నాక భారత్ ఎన్నో అద్భుత విజయాలు సాధించిన విషయం తెలిసిందే. ఐతే, ప్రపంచకప్ కోసం జట్టు ఎంపిక, ఆ తర్వాత కూడా టీమిండియా నెం. 4కు సమాధానం దొరక్కపోవడం, అద్భుతంగా రాణిస్తున్న సంజూ శాంసన్ లాంటి ఆటగాడిని పక్కనపెట్టి… రిషబ్ పంత్ ని కొనసాగించడం పట్ల తీవ్ర విమర్శలొస్తున్నాయ్.

గంగూలీ బీసీసీఐ బాస్ అయ్యాక.. ఎమ్మెస్కెకు చెక్ పెడతారనే ప్రచారం జరిగింది. ఐతే, మారిన కొత్త నిబంధనలు ఎమ్మెస్కేకు వరంగా మారనున్నాయి. ఆయన మరికొద్దిరోజులు పదవిలో కొనసాగే ఛాన్స్ ఉందనుకొన్నారు. కానీ, అలాంటిదేమీ లేదు. బీసీసీఐ పాత రాజ్యాంగం ప్రకారమే ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పదవీ కాలం ఉంటుందని గంగూలీ స్పష్టం చేశాడు. 

‘వారి పదవీ కాలం పూర్తయింది. తమ పదవీ కాలం దాటి వారు కొనసాగలేరు. వారు ఎంతో గొప్పగా పనిచేశారు. సెలక్టర్ల విషయంలో కొత్త విధానం తీసుకవస్తాం. ప్రతి ఏడాది సెలక్టర్లను నియమించడం సరైనది కాదు’ అని బీసీసీఐ 88వ సర్వసభ్య సమావేశం అనంతరం దాదా తెలిపాడు. దాంతో త్వరలోనే ఎమ్మెస్కే చీఫ్ సెలక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.