మెట్రో.. జూన్ 1 డెడ్ లైన్.. !

హైద‌రాబాద్ మెట్రోరైలుపై మంత్రి కేటీఆర్ స‌మీక్ష నిర్వ‌హించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హెచ్ఎంఆర్ అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మెట్రో రైలుకు వస్తున్న భారీ స్పందన నేపథ్యంలో రైళ్ళ సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీంచాలన్నారు. అయితే వచ్చే ఫిబ్రవరి నాటికి ప్రయాణీకుల సంఖ్యను బట్టి ఫ్రీక్వెన్సీ ని పెంచుతామని మంత్రికి హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు.

మెట్రో ప్రయాణీకులకు అవసరం అయిన పార్కింగ్ సౌకర్యాలపైన మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. అవసరమైన‌ మేరకు పార్కింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయాల‌ని, ఇప్పటి వరకు ఉన్న పార్కింగ్ ప్రాంతాలను ప్రజలకు తెలిసేలా చర్యలు చేపట్టాలన్నారు.అవ‌స‌ర‌మైతే పోలీస్ శాఖ సహాకారం తీసుకోవాలని హెచ్ఎంఆర్ అధికారుల‌కు సూచించారు.

మెట్రో స్టేషన్లలో తాగునీరు, మూత్రశాలల ఏర్పాటుపైన త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పరిమితంగా ఉన్న మూత్రశాలలకు అదనంగా మరిన్ని మూత్రశాలల నిర్మాణం తక్షణం చేపట్టాలన్నారు. దీంతోపాటు జూన్ 1 డెడ్ లైన్ పెట్టుకుని ఐటి కారిడార్లో మెట్రో పనులు పూర్తి చేయాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉపయోగపడే అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ రూట్ విష‌యంలో ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు మంత్రి కేటీఆర్.