విక్రమ్ లాండర్ ఫోటోలు రిలీజ్ చేసిన నాసా !

సెప్టెంబర్‌ 7న చంద్రుడి ఉపరితలంపై దిగాల్సిన చంద్రయాన్‌-2లోని విక్రమ్‌ ల్యాండర్ చివరి క్షణంలో భూమితో సంబంధాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి విక్రమ్‌ జాడను కనుగొనేందుకు ఇటు ఇస్రోతో పాటు అటు నాసా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడా ప్రయత్నాలు ఫలించాయి. విక్రమ్‌ ల్యాండర్‌ జాడను నాసా కనిపెట్టింది. నాసాకు చెందిన లూనార్‌ రీకనైసాన్స్‌ ఆర్బిటర్‌(ఎల్‌ఆర్‌వో).. విక్రమ్‌ శకలాల వల్ల చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా గుర్తించింది.

ఈ మేరకు చిత్రాలను తీసి పంపింది. అక్టోబర్ 14, 15, నవంబర్‌ 11 ఈ చిత్రాలను తీసి ధ్రువీకరించినట్లు వెల్లడించింది. విక్రమ్ శకలాలు దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న రెండు డజన్ల ప్రదేశాల్లో పడ్డట్లు గుర్తించింది. షణ్ముగ సుబ్రహ్మణియన్‌ అనే వ్యక్తి విక్రమ్‌కు సంబంధించిన తొలి శకలాన్ని కనుగొన్నట్లు నాసా ప్రకటించింది. విక్రమ్‌ కూలిన ప్రదేశానికి వాయువ్య దిశలో 750 మీటర్ల దూరంలో శకలాన్ని షణ్ముగం గుర్తించినట్లు పేర్కొంది. అనంతరం ఎల్‌ఆర్‌వో ప్రాజెక్టు బృందం ఇతర శకలాలను సైతం గుర్తించినట్లు నాసా పేర్కొంది. అక్టోబర్‌లో వెలుతురు ఉండడంతో జాడను కచ్చితంగా కనుగొనడానికి సాధ్యమైంది.