విక్రమ్ ల్యాండర్ ఆచూకీని గుర్తించింది నాసా కాదట ! 

చంద్రయాన్ 2 లోని విక్రమ్ ల్యాండర్ ఆచూకీ దొరికినట్లు నాసా మంగళవారం ప్రకటించింది. చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొనడంతో అది విచ్ఛిన్నమైందని వెల్లడించింది. చెన్నైకు చెందిన మెకానికల్ ఇంజినీర్ షణ్ముగ సుబ్రమణియన్ సాయంతో ల్యాండర్ ను గుర్తించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేసింది. ఐతే, విక్రమ్ ఆచూకీ కనుగొన్నది నాసా కాదని, దాని జాడను తాము ఎప్పుడో గుర్తించామని ఇస్రో అధినేత కె. శివన్ అన్నారు. 

ఈ విషయాన్ని మేం ఇప్పటికే ఇస్రో వెబ్ సైట్లో వెల్లడించాం. కావాలంటే మీరు కూడా చూడొచ్చని చెప్పారు. చంద్రయాన్ 2 ప్రయోగం జరిగిన మూడు రోజుల తర్వాత అంటే సెప్టెంబరు 10న విక్రమ్ గురించి ఇస్రో తమ వెబ్ సైట్ లో ఇలా పేర్కొంది. చంద్రయాన్ -2 ఆర్బిటర్ విక్రమ్  ల్యాండర్ ను గుర్తించింది. అయితే, దానితో ఇంకా కమ్యూనికేషన్ జరగలేదు. ల్యాండర్ తో కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలిపింది. అందుకే నాసా కంటే ముందే విక్రమ్ ల్యాండర్ ను తాము గుర్తించామని శివన్ చెబుతున్నారు.