దేశ ఆర్థిక పరిస్థితిపై చిదంబరం ఆవేదన

దేశ ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి. చిదంబరం ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడకుండా మౌనం పాటిస్తున్నారని.. ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రం అసమర్థ మేనేజర్‌గా మిగిలిందని చిదంబరం విమర్శించారు. ఐఎన్ ఎక్స్ మీడియా అక్రమ నగదు చలామణి కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో గత 105 రోజులుగా కారాగారంలో ఉన్న ఆయన నిన్న సాయంత్రం విడుదల అయ్యారు.

దీంతో చిదంబరం ఈరోజు పార్లమెంట్  శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం కుప్పకూల్చిందని అన్నారు. ఆర్థిక వ్యవహారాల్లో కేంద్రం అసమర్థ మేనేజర్‌గా మిగిలిందని ఆయన విమర్శించారు. గ్రామీణ వినియోగం, గ్రామీణ వేతనాలు పడిపోయాయన్నారు. ఉల్లిగడ్డ తిననని ఆర్థిక మంత్రి చెప్పారు. దానర్థమేంటీ..? అంటే ఆవిడ అవకాడో తింటారా? అని ఎద్దేవాచేశారు.