ఢిల్లీ అగ్నిప్రమాదం : 43కి చేరిన మృతుల సంఖ్య


దేశ రాజధాని ఢిల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌ మండీ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని 43 మంది మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాద సమయంలో నిద్రిస్తున్న కొంత మంది కార్మికులకు మంటల్లో చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు.

ఈ ప్రమాదంలో రెన్క్యూ టీమ్స్‌ 56 మందిని రక్షించారు. క్షతగాత్రులను ఢిల్లిలోని నాలుగు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్,  ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఢిల్లి సీఎం కేజ్రీవాల్‌, కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేజ్రీవాల్‌ ప్రమాద స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి రూ.లక్ష పరిహారం ఇస్తామన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నామన్నారు.ఢిలీ పోలీసులు ఫ్యాక్టరీ ఓనర్ పై కేసు నమోదు చేశారు.