ఏపీలో కొలువుల జాతర..!
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగుల్లో కొత్త జోష్ నింపింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. డీఎస్సీ ప్రకటన విడుదల చేసి వారికి శుభవార్తనున ప్రకటించింది. మరోసారి భారీ సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 12,370 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం లోపు పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈనెల 26 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 8 చివరి తేదీ. హాల్ టికెట్స్ను మార్చి 9వ తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 23, 24, 26 తేదీల్లో డీఎస్సీ పరీక్ష ఉంటుంది. పరీక్షల అనంతరం మే 5న మెరిట్ లిస్టు ప్రకటన చేస్తారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభమయ్యేలోపు డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
డీఎస్సీలో సెలెక్ట్ అయిన వారికి జూన్ 8 నుంచి 11 లోపు పోస్టింగ్స్ ఇస్తామన్నారు. స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, సెకండ్ గ్రేడ్ టీచర్స్, పీఈటీ పోస్టులు అన్నీ కలిపి 10,313 పోస్టులు ఉన్నాయి. ఇతర పోస్టులన్నీ కలిపితే మొత్తం 12వేల 370 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామన్నారు.