కంటోన్మెంట్ ప్రజలకి కేంద్రం గుడ్ న్యూస్
కంటోన్మెంట్ వాసులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. భవనాల అంతర్గత నిర్మాణాల్లో నిబంధనలను సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు కంటోన్మెంట్లో ఇండ్లు, భవనాలకు సంబంధించి ఏ చిన్నపాటి అంతర్గత మరమ్మతులు చేపట్టాలన్నా.. కంటోన్మెంట్ బోర్డు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. తాజాగా వాటిని కేంద్రం సడలించింది. ఈ మేరకు రక్షణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన సూచనల మేరకు కంటోన్మెంట్ యాక్ట్ 2006 లోని సెక్షన్ 235(2) (ఎ) ప్రకారం భవనాలలో అంతర్గత మరమ్మతులకు అనుమతులు అవసరం లేదని రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం క్రింది పనులకి కంటోన్మెంట్ బోర్డు అనుమతి అవసరం లేదు.
* అంతర్గత గోడ నిర్మాణం
* భవనం పైన పిట్టగొడ నిర్మాణం, లేదా సెట్బాక్ పరిధి లోపల ఉన్న ప్రహరీ గోడ, 1.20 మీటర్ల ఎత్తున కల్గిన ప్రహరీ గోడ నిర్మాణం, 50 సెంటిమీటర్ల వరకు సజ్జ పునర్ నిర్మాణం.
* మెట్ల మరమ్మతులు
* వైట్ వాషింగ్ లేదా రంగులు వేయడం
* కొత్త ఫోరింగ్ను ఏర్పాటు చేయడం..
* పాడైపోయిన స్లాబ్‌కు మరమ్మతులు చేయడం
* ఏసీ అమర్చుకోవడానికి పాల్ సీలింగ్, లైటింగ్ లేదా డెకరేషన్ చేసుకోవడానికి..
* గోడలకు ప్లాస్టరింగ్, ప్యాచ్ వర్క్‌లు చేసుకోవడం..
* భవనం లోపల ఉన్న అంతర్గత గోడలకు కిటికిలు, వెంటిలేటర్లను అమర్చుకోవడం లేదా తొలగించడం..
* గోడలోంచి పడిపోయిన ఇటుకలు, రాళ్లను తిరిగి అమర్చుకోవడం
* ప్లంబింగ్, శానిటరీ వస్తువుల కోసం మరమ్మతులు చేసుకోవడం, కొత్తవి ఏర్పాటు చేసుకోవడం..
* ప్రహరీగోడకు మరమ్మతులు
* ఏసీ, వాటర్ ట్యాంక్ , సోలార్ ఫ్యానల్స్, సోలార్ వాటర్ హిటర్ ఏర్పాటు.