కేసీఆర్ పాలన.. ‘పైన పటారం..లోన లొటారం’ !

తెలంగాణలో పాలన ‘పైన పటారం..లోన లొటారం’ అనే రీతిలో ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్.. కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని.. ఆర్థికమంత్రి ప్రమేయం లేకుండా ఆర్థికశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షలు చేస్తున్నారని లక్ష్మణ్ విమర్శించారు. తద్వారా అల్లుడు హరీష్ రావుని సీఎం కేసీఆర్ ఇప్పటికీ పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు లక్ష్మణ్.

కడుపులో కత్తులు పెట్టుకుని.. నోట్లో చక్కెర పెడుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ తీరు ఆవు తోలు కప్పుకున్న పులిలా ఉందని ఎద్దేవా చేశారు.  తెలంగాణలో పాలన ‘పైన పటారం..లోన లొటారం’ అనే రీతిలో ఉందన్నారు. 5 వేల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలేని పరిస్థితిలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉందని లక్ష్మణ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో 3 లక్షల ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు ఖాళీలు ఉన్నాయని.. ఆరేళ్లలో 30వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారన్నారు. టీఎస్‌పీఎస్సీ ఉనికి తెలంగాణలో ప్రశ్నార్థకంగా మారిందన్నారు.