గొల్లపూడి అంత్యక్రియలు పూర్తి

ప్రముఖ రచయిత, సంపాదకుడు, నటుడు గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో బాధపడుతూ గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మనవడు, మనవరాలు విదేశాల నుంచి రావాల్సి ఉండడంతో అంత్యక్రియలను ఆదివారానికి వాయిదా వేశారు. కొద్దిసేపటి క్రితమే చెన్నైలో గొల్లపూడి అంత్యక్రియలు ముగిశాయి.

చెన్నై కన్నమ్మపేట శ్మశాన వాటికలో గొల్లపూడి మారుతీరావుకు అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కుమారుడు సుబ్బారావు మారుతీరావుకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చెన్నై టి.నగర్‌లోని ఆయన స్వగృహం నుంచి ప్రారంభమైన మారుతీరావు అంతిమయాత్ర కన్నమ్మపేట శ్మశానవాటిక వరకు సాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.  

మారుతీరావు 1959లో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. పత్రికలో పనిచేస్తూనే రచయితగా మారి అనేక కథలు, నాటకాలు రాశారు. 1963లో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశాడు. మారుతీరావుకు అది మొదటి సినిమా. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథారచనకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది. దాదాపు 250కిపైగా చిత్రాల్లో నటించారు.