మరికాసేపట్లో యాదాద్రికి సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొద్దిసేపట్లో యాదాద్రి చేరుకోనున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణపనుల పురోగతిని సీఎం కేసీఆర్ పరిశీలిస్తారు. అలాగే ప్రెసిడెన్షియల్ సూట్, ఇతర కాటేజ్ నిర్మాణాలను పరిశీలించి మహా సుదర్శనయాగం జరిగే ప్రాంతాన్ని గుర్తిస్తారు. నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. యాదాద్రి పర్యటనకి సీఎం కేసీఆర్ వెళ్లడం ఇది 12వ సారి. ప్రధాన ఆలయ నిర్మాణ పనులు 95% పూర్తయ్యాయి.

బ్రహ్మోత్సవం మండపంతో కలిపి ప్రధానాలయం నిర్మాణం 4.35 ఎకరాల్లో జరుగుతున్నది. ముఖమండపం భక్తులకు కనువిందు చేస్తున్నది. 32 నారసింహ అవతారాలు, ప్రహ్లాదుని చరిత్రను తెలిపే ఘట్టాలు చూడ ముచ్చటగా నిర్మాణం జరుపుకొంటున్నాయి. సహజ వెలుతురు ఉండేలా ముఖమండపానికి 12 సోలార్ రూఫ్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నారు. 500 మంది భక్తులు కూర్చుని శ్రీవారిని కల్యాణాన్ని తిలకించేలా నిత్యకల్యాణ మండపంలో ఏర్పాట్లుచేస్తున్నారు. 3000 మంది కూర్చొని తిలకించేలా బ్రహ్మోత్సవ మండపంలో ఏర్పాట్లు చేస్తున్నారు.