ఉద్యోగాల కల్పనే లక్ష్యంగానే పనిచేస్తున్నాం : కేటీఆర్
మంత్రి కేటీఆర్ మంగళవారం పరిశ్రమలు, ఐటీ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉపాధి కల్పనే లక్ష్యంగా పెట్టుబడులకు ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే టీఎస్ ఐపాస్ ద్వారా 11,569 కంపెనీలకు అనుమతులు ఇచ్చాం. మరింత మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా పలు రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం అన్నారు. అంతేకాదు.. టెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు.
అంతర్జాతీయ కంపెనీలు, విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలే లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. టెక్స్ టైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు పలు అంతర్జాతీయ కంపెనీలు అంగీకారం తెలిపాయన్నారు. పెట్టుబడుల సేకరణకు లక్ష్యాలు నిర్ధేశించుకుని అధికారులు పనిచేయాలని సూచించారు. వరంగల్ టెక్స్ టైల్స్ పార్కులో దిగ్గజ కంపెనీ యంగ్ వన్ భారీ పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు.