నెం.4’కు శ్రేయస్ పర్ ఫెక్ట్
చాన్నాళ్ల నుంచి టీమిండియాకు నెం.4 సమస్య ఉంది. వరల్డ్ కప్ కి ముందు.. ఆ తర్వాత కూడా జట్టులో ఈ సమస్య కొనసాగుతోంది. అంబటి రాయుడు, అజింక్య రహానె, కేదార్ జాదవ్, దినేశ్ కార్తిక్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, మనీశ్ పాండే, రిషభ్ పంత్.. ఇలా ఎంత మందికి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఆ స్థానంలో మెరుస్తున్నాడు. శ్రేయస్ రెండేళ్ల కిందటే టీమిండియాకు ఎంపికైనా సరైన అవకాశాలు దక్కలేదు. ఒకసారి బహిరంగంగానే ఈ విషయాన్ని వెల్లడించాడు.
మరోవైపు అవకాశం వచ్చిన ప్రతీసారీ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటివరకు 11 వన్డేలాడిన అతడు 52.11 సగటుతో 6 అర్ధశతకాలు సాధించాడు. 469 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 54 మ్యాచ్‌ల్లో 52.18 సగటుతో 12 శతకాలు, 23 అర్ధ శతకాలు సాధించాడు. ప్రపంచకప్ తర్వాత భారత్.. విండీస్ పర్యటన సందర్భంగా రెండు వన్డేల్లో (71, 65 పరుగులతో) రాణించాడు. ఇటీవల బంగ్లాతో జరిగిన మూడో టీ20లో 61 బాదాడు. తాజాగా విండీస్‌తో జరిగిన రెండు వన్డేల్లో 70, 53 అర్ధశతకాలతో మెరిశాడు. పరిస్థితులని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఆడటం అయ్యర్ ప్రత్యేకత. అందుకే నెం.4కు అతడు శ్రేయస్కరమైన ఆటగాడని చెబుతున్నారు.