తెలంగాణలో థర్డ్ ఫ్రంట్…!?
కాంగ్రెస్ ,టీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా మూడో ప్రత్యామ్్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలోన వివిధ ప్రజాసంఘాలు,కళాకారులతో పాటు పది వామపక్ష పార్టీలు ఒకతాటిపైకి వచ్చాయి. ఎన్నికల్లోగా కలిసొచ్చే వారితో ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడి పోటీకి సిద్ధం కావాలని వామపక్షాలు భావిస్తున్నాయి.
కాంగ్రెస్ , టీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని, అందుకే మూడో ప్రత్యామ్నాయ కూటమి అవసరమని వామపక్షాలు భావిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఐక్యవేధిక ఏర్పాటు చేసి ప్రధాన పార్టీలకు ధీటుగా 119 నియోజక వర్గాల్లో పోటీకి సిద్దం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. జీఎస్టీ , నోట్ల రద్దుతో దేశంలో సంక్షోభం ఏర్పడిందని, గుజరాత్ ఎన్నికల పలితాలతో దేశరాజకీయాలు మారబోతున్నాయని వారు గాఢంగా నమ్ముతున్నారు. ఎన్నికల్లో బీజేపి గెలిస్తే ముందస్తు ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లే అవకాశం ఉంది కాబట్టి, ఈలోగానే మూడో ఫ్రంట్ ను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు కామ్రెడ్స్..
అయితే మూడో ఫ్రంట్ వల్ల ఎక్కువగా టీఆర్ఎస్ కే లాభం తప్ప పెద్ద ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బలహీన వర్గాల ఓట్లు చీలి కాంగ్రెస్ ఓటుబ్యాంకు దెబ్బతింటుదని, అధికార టీఆర్ఎస్ కు ఇది కలిసి వచ్చే అంశంగా మారుతుంది తప్ప ఆశించిన ఫలితాలు రావడం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మూడో ఫ్రంట్ ఫార్ములా తెలంగాణలో పనిచేస్తుందో లేదో చూడాలి మరి..