2011 మధుర జ్ఝాపకాలు సచిన్ మాటల్లో.. !
24 ఏళ్ల పాటు టీమిండియాకు ఎనలేని సేవలు అందించిన మాస్టర్ బ్లాస్టర్.. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా.. శ్రీలంకపై విజయం సాధించిన తర్వాత ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ ఆఖర్లో కులశేఖర వేసిన 48.2 బంతికి ధోనీ హెలికాఫ్టర్ షాట్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అప్పుడే డ్రెస్సింగ్ రూమ్‌లోంచి పరుగెత్తుకొచ్చిన సచిన్.. యువరాజ్ సింగ్‌ను హత్తుకొని ఏడ్చేశాడు.
ఆ మధర జ్ఝాపకాలని ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ గుర్తు చేసుకొన్నారు. ధోనీ సిక్స్ కొట్టగానే నేను భావోద్వేగానికి గురయ్యా. ఆ సమయంలో యువరాజ్ సింగ్‌ను హత్తుకొని ఏడ్చేశా. ఆ క్షణం కోసమే నేను క్రికెట్ ఆడటం మొదలెట్టానని అప్పుడు చెప్పాను. హోటల్‌కు చేరుకున్నాక మేం చేయని హంగామా లేదు. మా ఫ్లోర్‌లో ఒక్క రూమ్‌డోర్ కూడా మూయలేదు. షాంపేన్ ఉప్పొంగింది. పెద్ద మ్యూజిక్‌తో సంబరాలు చేసుకున్నాం. అప్పుడు నేను కూడా డ్యాన్స్ చేశా. సహజంగా నేనెప్పుడూ డ్యాన్స్ చేయను. కానీ ఆరోజు అంజలితో కలిసి చిందులేశా. నా జీవితంలో అదో గొప్ప మధురానుభూతి అని సచిన్ చెప్పుకొచ్చారు.