నీట్, జేఈఈ కోచింగ్ ఫ్రీ…!!!
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాప్రమాణాలు పెంచడంతో పాటు, సౌకర్యాలలో కూడా ఎలాంటి లోటు లేకుండా చూడాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఫ్రీ బస్ పాస్ సౌకర్యం కల్పించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు.
ఈ వేసవి నుంచే ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధులకు ఉచితంగా నీట్, జేఈఈ కోచింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కళాశాలల్లో మెరుగైన సౌకర్యాల కోసం 270 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. పాఠశాలల్లో మాదిరిగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే విషయాన్ని ఆలోచిస్తున్నామన్నారు.