నాగబాబు దారెటు ?
ఇంగ్లీష్ మీడియం, ఏపీకి మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్ నిర్ణయాన్ని మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ చేసారు. ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం సీఎం జగన్ నిర్ణయాలని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏకంగా నిరసన దీక్షలకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్-చిరు మధ్య మరోసారి విబేధాలు తలెత్తాయని.. అందుకే పవన్ రాజకీయ శత్రువు జగన్ కి చిరు సపోర్టు చేస్తున్నారని చెప్పుకొంటున్నారు.
ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు దారెటు ? ఆయన అన్నయ్యని సపోర్ట్ చేస్తారా ? తమ్ముడు పవన్ కల్యాణ్ ని సపోర్ట్ చేస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది. గతంలో ఇలాంటి పరిస్థితే వచ్చినప్పుడు నాగబాబు చిరంజీవిని సపోర్ట్ చేశారు. కానీ, ఇప్పుడు నాగబాబు జనసేన సభ్యుడిగా ఉన్నారు. అయినా.. నాగబాబు వన్ సైడ్ కాలేదు.
న్యూట్రల్ స్పందించడం విశేషం. తాజాగా రాజధాని రైతుల ఆవేదన తనకి తెలుసని ఓ వీడియోని విడుదల చేశారు నాగబాబు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో అమరావతిలో సేకరించిన మొత్తం భూమి 34,322 ఎకరాలని ఆయన అన్నారు. భూములు ఇచ్చిన రైతుల సంఖ్య 29,881 అని అన్నారు. ఐతే, ఇందులో ఐదు వేల ఎకరాల్లో అవకతవకలు జరిగాయని ప్రస్తుతం ప్రభుత్వం ఆరోపిస్తోందని నాగబాబు అన్నారు.
అది వాస్తవంగా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీనిపై పూర్తి విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దాన్ని సాకుగా చూపి రాజధాని కోసం భూములిచ్చిన రైతులని మోసం చేయకూడదని నాగబాబు అన్నారు. ఆయన మాటలు చూస్తుంటే.. అటు అన్నయ్య, ఇటు తమ్ముడి స్టాండ్ కి ఇబ్బంది కలగకుండా వ్యవహరించినట్టు తెలుస్తోంది.