రూలర్ క్వాలిటీ ప్రింట్ బయటికొచ్చింది

సీనియర్ దర్శకుడు కె.యస్ రవికుమార్ దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం ‘రూలర్’. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన రూలర్ మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా.. మాస్ ప్రేక్షకులని బాగానే అలరిస్తున్నాడు. ఐతే, ఇప్పటికే ఈ సినిమా క్వాలిటీ ప్రింట్ బయటికి రావడంపై చిత్రబృందం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
 
ఆదివారం హైదరాబాద్ లో ‘రూలర్‌’ సక్సెస్ మీట్ ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ.. “రూలర్ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి. గత సినిమా ‘జై సింహా’ కంటే బాగుందని అంటున్నారు.ఇంటర్నెట్‌లో ఎంతోమంది పైరసీ కాపీలను చూస్తున్నారు.  చాలా క్వాలిటీగా రూలర్ పైరసీ బయటికొచ్చింది. మేము అనేక లింకులను తొలగించాం” అని లీకుల విషయాన్ని బయటపెట్టారు.

బాలయ్య మాట్లాడుతూ.. ” సి. కల్యాణ్ తో నేను చేసిన మూడో సినిమా ఇది. సినిమా బాగుంది. నటీనటులు బాగా చేశారు. దర్శకుడు రవికుమార్ బాగా తీశారు. ప్రేక్షకులు సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు” అని చెప్పుకొచ్చారు. 

వాస్తవానికి ‘రూలర్’ పై ప్లాప్ టాక్ నడుస్తొంది. ఐతే, అవేవీ పట్టించుకోకుండా రూలర్ చిత్రబృందం సక్సెస్ మీట్ ని నిర్వహించడం విశేషం. అంతేకాదు.. సినిమా బాగా ఉందని.. హిట్ అని చెప్పుకోవడం బాలయ్య అభిమానులకే రుచించడం లేదని తెలుస్తోంది.