గుడ్ న్యూస్ : తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల తగ్గింపు

ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే పనిని తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అతి తక్కువ కాలంలోనే ఆర్టీసీని లాభాల పట్టేంచే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్సిల్, గూడ్స్ ని సరఫరా చేయాలని భావిస్తున్నారు. ఇటీవల 10శాతం ఛార్జీలని కూడా పెంచారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అంతగా డిమాండ్ లేని రోజుల్లో గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గించింది.

బెంగళూరు-హైదరాబాద్ , హైదరాబాద్-బెంగళూరు మార్గంలో ఈ విధానాన్ని బుధవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మార్గంలో రోజూ 80 నుంచి 90 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సులు 32 వరకు ఉన్నాయి. వాటిల్లో 25 వరకు ఏసీ బస్సులు. కర్ణాటక ఆర్టీసీ 25 వరకు నడుపుతోంది.

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కిలోమీటరుకు 20 పైసలు ఛార్జీని పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు గరుడ ప్లస్ బస్సు ఛార్జీ రూ. 1,300 అయింది. కర్ణాటక ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో తెలంగాణ ఆర్టీసీతో పోలిస్తే ఛార్జీ తక్కువగా ఉంది. డిమాండ్ ఆధారంగా ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఐతే, శని, ఆదివారాల్లో మాత్రం పెంచిన ఛార్జీలు అమలులో ఉండనున్నాయి.