తిరుపతిలో పేలిన నాటు బాంబులు
తిరుపతిలో నాటు బాంబు పేలడం కలకలం రేగింది. తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సమీపంలోని పేలిన నాటుబాంబు ఘటనలో ఓ కుక్క మృతి చెందింది. పొదల్లో నుంచి ఓ కుక్క నాటుబాంబును నోట కరుచుకుని బయటకు తెచ్చింది. దీంతో ఒత్తిడికి గురై నాటు బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో కుక్క తల భాగం ఛిద్రమైంది. భారీ శబ్దం రావడంతో ఆసుపత్రి సిబ్బందితో పాటు రోగులు భయాందోళనకు గురయ్యారు.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఘటనాస్థలికి సమీపంలో పేలకుండా ఉన్న మరో ఆరు బాంబులను నిర్వీర్యం చేశారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బహుశా.. అడవి పందులని పట్టేవారు ఈ నాటు బాంబులని అక్కడ ఉంచి ఉంటారని అంచనా వేస్తునారు. దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉందనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.