హైదరాబాద్’లో పబ్’ల బంపర్ ఆఫర్
యేడాది ఆఖరిరోజు డిసెంబర్ 31న కిక్కులో మునిగితేలాలని కుర్రకారు ఆశపడటం సహజం. ఐతే, నగరంలో యువత పార్టీ ప్లానింగ్ కి పోలీసుల సీరియస్ వార్నింగులు సంకెళ్లు వేసినట్టు అనిపిస్తోంది. డిసెంబర్ 31 న తాగి తందాన ఆడితే జైలు శిక్ష తప్పదని హైదరాబాద్ పోలీసులు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.
తాగుదామంటే డ్రంకెన్ డ్రైవ్‌లు ఏం చేయాలో తెలియక తికమక పడుతున్న నగర వాసులకు కొన్ని పబ్‌లు, ఈవెంట్ మేనేజ్మెంట్ బంపర్ ఆఫర్‌ను ప్రకటించాయి. పార్టీ వచ్చేంత వరకు మీదే బాధ్యత… ఎంజాయ్ చేసి మస్తుగా తాగిన తరువాత జాగ్రత్తగా ఇంటి వద్ద దింపడం మేము చూసుకుంటామని నిర్వాహకులు చెబుతున్నారు.
పార్టీ అయిపోయిన వెంటనే షేరింగ్ ప్రకారం క్యాబ్‌లలో జాగ్రత్తగా ఇంటికి పంపించేందుకు పలు పబ్‌లు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. కొంత మంది ఈవెంట్ నిర్వాహకులు క్యాబ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రయాణపు ఖర్చులతో కలిసి టికెట్లను అమ్మకాలు సాగిస్తున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుతాయని నిర్వాహకులు అంటున్నారు. ఈ రకమైన పబ్ లని ఎంచుకోవడానికి యువత ఆసక్తిని చూపడం మంచి పరిణామం.