34 మందితో కొలువుదీరిన మహా కేబినేట్
మహారాష్ట్ర కేబినెట్ 36మందితో కొలువుదీరింది. 34 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరేకు కూడా కేబినెట్ లో చోటు దక్కింది. మహారాష్ట్రలో అత్యధికంగా 43 మంది మంత్రులుండేందుకు అవకాశముంది. అశోక్ చవాన్, దిలీప్ పాటిల్, ధనంజయ్ ముండే, అనిల్ దేశ్ ముఖ్, హసన్ ముష్రిఫ్, వర్షా గైక్వాడ్, రాజేంద్ర షింగానే, నవాబ్ మాలిక్, రాజేశ్ తోపే, నునిల్ కేదార్, సంజయ్ రాథోడ్, గులాబ్ పాటిల్, బాలాసాహెబ్ పాటిల్, అనిల్ పరబ్ తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినవారిలో ఉన్నారు.
ఎన్నో దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఆదిత్య ఠాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నుంచి గెలిచిన శాసనసభలోకి అడుగుపెట్టారు. అయితే తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆదిత్యను కేబినెట్ లో తీసుకోవాలని సంకీర్ణ ప్రభుత్వం చివరి నిమిషంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. నేటి మంత్రి వర్గ విస్తరణలో ఆయన కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. విధాన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.