ఉత్తమ్ రాజీనామా ప్రకటన
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా ప్రకటన చేశారు. పీసీసీ పదవి నుంచి తప్పుకుంటానని, మున్సిపల్ ఎన్నికల తర్వాత రాజీనామా చేస్తానని తెలిపారు. ఈ మేరకు సోమవారం హుజూర్ నగర్ లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఉత్తమ్ ప్రకటన చేశారు. అంతేకాదు.. పీసీసీ పదవి నుంచి తప్పుకున్నాక.. కోదాడ, హుజూర్ నగర్ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని.. నల్గొండ జిల్లా ప్రజలకి దగ్గరగా ఉంటానని మాటిచ్చారు.
ఈ నేపథ్యంలో కొత్త టీ-పీసీసీ చీఫ్ ఎవరనే చర్చ మళ్లీ మొదలైంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఐతే, యువతలో క్రేజ్ ఉండటంతో రేవంత్ కి పీసీసీ పదవి దక్కకుండా కొందరు అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పట్టంకట్టడం సీనియర్లకి ఇష్టం లేదు. ఇక సౌమ్యుడిగా పేరున్న శ్రీధర్ బాబుకు అనుకూలంగా రాష్ట్రంలోని కొందరు సీనియర్ నేతలు లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన కోమట్ రెడ్డికి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెబుతున్నారు.