400 కొట్టగల సత్తా వారికే ఉంది : లారా
టెస్టుల్లో ఇప్పటి వరకు 400 వ్యక్తిగత పరుగులు చేసిన రికార్డు లారాకు ఉంది. ఇంగ్లాండ్‌పై అతడు ఈ రికార్డును నెలకొల్పాడు. 15 ఏళ్లుగా ఈ రికార్డు అలానే సజీవంగా ఉంది. ఈ రికార్డుని బద్దలు కొట్టే సత్తా కేవలం ముగ్గురు ఆటగాళ్లకి మాత్రమే ఉందని లారా అభిప్రాయపడ్డారు. ఆ ముగ్గురిలో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు కావడం విశేషం.
ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్, టీమిండియా ఆటగాళ్లు విరాట్, రోహిత్ లకి తన 400ల రికార్డుని బద్దలు కొట్టే సత్తా ఉందని లారా తెలిపారు. కోహ్లీ అటాకింగ్ ఆటగాడని, రోహిత్ తనదైన రోజు ఈ రికార్డును అందుకోగలడని లారా అన్నారు. ఇక ఈ దిగ్గజం టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఐసీసీ నిర్వహించే అన్ని టోర్నీల్లో విరాట్ నేతృత్వంలోని భారత జట్టు విజయం సాధించగలదని కొనియాడాడు. కోహ్లీ నేతృత్వంలో భారత్ జట్టు అటు టెస్టుల్లోనూ, ఇటు వన్డేల్లోనూ అత్యున్నత శిఖరాలను అధిరోహించిందని ప్రశంసించాడు.