ట్రంప్ ఆదేశాలతోనే.. బాగ్దాద్’పై దాడి !


ఇరాన్ సైనిక ఉన్నతాధికారి ఖాసీం సోలెమన్ ను చంపాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై దాడి చేసినట్లు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ధ్రువీకరించింది. ఇరాక్ లో ఉన్న తమ బలగాల్ని రక్షించుకునేందుకు ఖాసీంని చంపాలని ట్రంప్ ఆదేశించినట్లు పెంటగాన్ ప్రకటనలో పేర్కొంది.

మెరికా సైనిక వర్గాలు స్వీయ రక్షణలో భాగంగా దాడి చేయాల్సి వచ్చిందని తెలిపింది.దాడి జరిగిన కొద్దిసేపటికే ట్రంప్ అమెరికా జాతీయ జెండాను ట్విటర్ లో ఉంచడం గమనార్హం. జనరల్ సోలెమన్ మృతిని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా ధ్రువీకరించింది. అమెరికా వైమానిక దళాలలకు చెందిన హెలికాప్టర్లే దాడి చేశాయని ఆరోపించింది.

ఇటీవల ఇరాక్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ మద్దతున్న నిరసనకారులు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడున్న అమెరికా బలగాలతో తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగారు. దీనిపై స్పందించిన అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్.. అమెరికావాసులపై జరిపే దాడిని ఏమాత్రం సహించేది లేదన్నారు. దాడికి ఇరానే కారణమని ఆరోపించారు. తప్పకుండా ప్రతీకార చర్య ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఇరాన్ తమ చర్యల్ని నిలిపివేయాలని హితవు పలికారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజా దాడి జరిగినట్లు తెలుస్తోంది.