లోకేష్ మరోసారి అరెస్ట్ 

తెదేపా యువనేత నారా లోకేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సాయంత్రం లోకేష్ రాజధాని ప్రాంతంలో పర్యటించాలని భావించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు గోపి కుటుంబాన్ని, అలాగే పోలీసుల లాఠీఛార్జిలో గాయపడిన మహిళా రైతు పద్మను పరామర్శించాలని లోకేష్ భావించారు. సీనియర్ నేత కళా వెంకట్రావ్ తో కలిసి కాజా టోల్ ప్లాజా దగ్గరికి చేరుకొన్నారు. ఐతే, పాదయాత్రకి అనుమతి లేదంటూ లోకేష్, కళా వెంకట్రావులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో లోకేష్ అరెస్ట్ అవ్వడం ఇది రెండోసారి.

మరోవైపు, ఏపీలో రాజధానికి వ్యతిరేకంగా, అనుకూలంగా ర్యాలీలు జరుగుతున్నాయి. రాజధాని తరలింపుని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేసిన రోజు నుంచే అమరావతి రైతులు నిరసనలకి దిగారు. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు అంశానికి మద్దతు తెలిపుతూ విశాఖ, రాజమండ్రి, ఏలూరులోనూ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.