అఫిషియల్ : ‘ఆర్ఆర్ఆర్’ అక్టోబర్’కు వాయిదా

ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కొమరంభీమ్, అల్లూరి సీతారామ రాజు జీవికథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఇద్దరు వీరుల ఉమ్మడి పాయింట్ తో ఆర్ఆర్ఆర్ కథని రాసుకొన్నారు జక్కన్న. ఇందులో కొమరంభీమ్ గా ఎన్టీఆర్, ఆయనకి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. ఇక అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, ఆయనకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రకటన చేసినప్పుడే రిలీజ్ డేటు జులై 30, 2020గా ప్రకటించారు. ఐతే, కొన్నాళ్లుగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడుతుందనే ప్రచారం జరుగుతోంది. తారక్, చరణ్ లకి గాయాలు, కొన్ని సాంకేతిక కారణాల వలన ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో జాప్యం జరిగింది. వాయిదాపడక తప్పలేట్టు లేదని చెప్పుకొన్నారు. ఆ వార్తలని రాజమౌళి ఖండించలేదు. పైగా ఆ వార్తలు నిజమే అన్నట్టుగా.. ‘మత్తువదలరా’ ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ వాయిదాపై ఓ హింట్ కూడా ఇచ్చారు.

ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ వాయిదాపడటం దాదాపు ఖరారైంది. ఆర్ ఆర్ ఆర్ అక్టోబర్ కి వాయిదా పడనుందని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. తనకి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల కానుందని ట్విట్ చేశాడు. తరుణ్ ఆదర్శ్ చెప్పేవన్నీ నిజం కావాల్సిన అవసరం లేదు. గతంలో ఈయన చెప్పిన చాలా విషయాలు జరగలేదు. ప్రభాస్-స్వీటీ అనుష్క ప్రేమలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ముందే కూశాడు తరుణ్ ఆదర్శ్. ఆ తర్వాత అది నిజంకాదని తేలిపోయింది. బహుశా.. ఆర్ ఆర్ ఆర్ వాయిదా విషయం కూడా నిజం కావాల్సిన పనిలేదేమో.