పరీక్షల భయాన్ని ఇలా అధిగమించండి : ప్రధాని
విద్యార్థులకి పరీక్షల సమయం ఆసన్నమవుతోంది. బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్థులకి విలువైన సూచనలు చేశారు. సోమవారం దేశరాజధాని ఢిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. విద్యార్థులతో ముచ్చటించారు. పరీక్షల భయాన్ని ఎలా అధిగమించాలనే దానికి సంబంధించిన విద్యార్థులకి పలు సూచనలు చేశారు. ఈ చర్చకు తెలంగాణ రాష్ట్రం నుంచి 19 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు.
‘పరీక్షా పే’ చర్చలో ప్రధాని చెప్పిన కొన్ని కీలక అంశాలు..
* ‘వైఫల్యమనేది జీవితంలో ప్రతిఒక్కరికీ ఎదురువుతోంది. కానీ, దాన్ని అధిగమించి విజయం వైపు మనం అడుగులు వేయాలి. చంద్రయాన్-2నే తీసుకోండి. అది విఫలమైనపుడు నేను చాలా బాధపడ్డాను. కానీ శాస్త్రవేత్తల దగ్గరకు వెళ్లి వాళ్లను ప్రేరణ లభించేలా మాట్లాడాను. మన వైఫల్యాల నుంచే మనం పాఠాలు నేర్చుకోవాలి’
* ‘2001లో భారత్-ఆస్ట్రేలియా మధ్య కోల్‌కతాలో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అనిల్‌కుంబ్లే గాయపడినప్పటికీ వెనుదిరగకుండా తన ఆటను కొనసాగించాడు. ఆ సమయంలో మన టీంఇండియా చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. కానీ రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఎలా ఆలోచించాలనే దానికి ఇదొక నిదర్శనం
* ‘జీవితంలో పరీక్షలు ఒక భాగమే. విద్యాసంవత్సర ప్రయాణంలో బోర్డు పరీక్షలనేది ఒక మైలు రాయి. బోర్డు ఎగ్జామ్స్ ముఖ్యమే.. కానీ, అవే జీవితం అనుకోవడం మాత్రం సరైనది కాదు’
* * విద్యలో టెక్నాలజీ విద్యార్థులకు ఎంత వరకు ఉపయోగపడుతోందని ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు మోదీ సమాధానమిచ్చారు. ‘మనకు అవసరమైనంత వరకు మాత్రమే టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. స్మార్ట్‌ఫోన్లు మన సమయాన్ని హరించివేస్తున్నాయి. వాటితో గడుపుతూ మన సాధారణ జీవితాన్ని కోల్పోతున్నాం.
* పరీక్షలతో పాటు ఇతర వ్యాపకాల పై కూడా దృష్టి సారించాలి. అలా చేయడం వల్ల మీ ఆలోచనాసక్తి పెరుగుతోంది.
* తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి కొంత సమయాన్ని గడపాలి. వాళ్లకు ఏమి కావాలనే విషయాలను స్వయంగా అడిగి తెలుసుకోవాలి.