పవన్ ని జనసేన గేటు కూడా దాటనివ్వడం లేదు !
మూడు రాజధానుల బిల్లుపై ఏపీ అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. మూడు రాజధానులు వద్దు.. అమరావతియే ముద్దంటూ తెదేపా ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఇక తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ కి చేతులెత్తి మొక్కిమరీ.. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చకి అడ్డంకి మారిన ఏడుగురు తెదేపా ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు.
మరోవైపు, అసెంబ్లీ బయట జనసేన అధినేత పవన్ కల్యాణ్ షో కొనసాగుతోంది. మంగళగిరి జనసేన ఆఫీసులో ఆయన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. అనంతరం రాజధాని గ్రామాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఐతే, పవన్ ని జనసేన ఆఫీస్ గేటుకూడా దాటనీవ్వడం లేదు పోలీసులు. పవన్‌తో పోలీసు అధికారులు చర్చలు జరిపారు. పవన్‌ను అనంతపురం డీఐజీ కాంతిరాణా టాటా కలిశారు. పర్యటనకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. పవన్ మాత్రం రాజధానిలో పర్యటించి తీరుతానని చెబుతున్నారు.
రైతులు న్యాయపరమైన పోరాటం చేస్తుంటే.. పోలీసులు వారిపై లాఠిఛార్జీ చేశారని పవన్ అన్నారు. అంతేకాదు.. పోలీసులు తమ పార్టీ ఆఫీసులోకి వచ్చి పరిస్థితిని ఉద్రిక్తం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా కనిపిస్తోంది.