మంత్రి మల్లారెడ్డిపై కేసు

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై పోలీసులకి ఫిర్యాదు అందింది. మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డి టికెట్లు అమ్ముకున్నారని, ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డారని టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్ మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఎన్నికల కమిషన్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఇలాంటి నాయకుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరోవైపు, సోమవారంతో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం పోలింగ్ జరగనుంది.  రాష్ట్రంలో మొత్తం 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్, గ్రేటర్ ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం ఇంకా పూర్తి కాలేదు. దీంతో 10 నగరపాలికలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు 128 మున్సిపాలిటీల్లో సిద్దిపేట, అచ్చంపేట పురపాలికల పదవీ కాలం పూర్తి కాలేదు. అంతేకాకుండా కొన్ని సమస్యల వల్ల మరో ఐదు పురపాలక స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడం సాధ్యపడలేదు. దీంతో రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.