అసెంబ్లీలో జనసేన.. సీఎం భజన ! 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐతే జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ మాత్రం సీఎం జగన్ భజన చేస్తున్నారు. ఆయన భజన రోజు రోజుకి ఎక్కువవుతోంది. బుధవారం ఏపీ అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాపాక.. సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ పయనిస్తున్నారని.. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. గతంలో తెదేపా అధినేత చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు. కానీ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం వ్యవసాయం అంటే ఓ పండుగని నిరూపించారని రాపాక అన్నారు. ఇప్పుడు సీఎం జగన్ కూడా అదే పనిచేస్తున్నారని మెచ్చుకొన్నారు. సీఎం జగన్‌ రైతు పక్షపాతి. రాష్ట్రాభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో జగన్ ఉన్నారని రాపాక చెప్పుకొచ్చారు.

జనసేన పార్టీ గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక ఆ పార్టీకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. జనసేన అజెండాని పక్కనపెట్టేసి… ఆయన అధికార పార్టీకి కొమ్ముకాయడం.. సమయం దొరికినప్పుడల్లా సీఎం జగన్ భజన చేయడం.. జనసేన, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కి ఇబ్బందికరంగా మారింది. మరీ.. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటే.. ? కొన్ని టెక్నికల్ కారణాలున్నాయని చెబుతున్నారు.