మున్సిపల్ ఎన్నికలు.. పలు చోట్ల ఘర్షణలు !

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7గంటల నుంచే ప్రారంభం అయింది. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. పోలింగ్ సందర్భంగా పలు చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొంది. బోడుప్పల్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ స్టేషన్ వద్ద డబ్బులు పంచుతున్నాడని టీఆర్ఎస్ అభ్యర్థి జడిగే రమేష్ యాదవ్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తనపైకి దౌర్జన్యానికి దిగుతున్నారని ఆయన ఆరోపించారు.

వరంగల్‌ గ్రామీణం జిల్లా పరకాల 21వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసుల సమక్షంలోనే ఇరువర్గాలు తోసుకున్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపించారు.

తెలంగాణలో మొత్తం 120 మునిసిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 12,843 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 53.50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.