సోషల్ మీడియాపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై సీరియస్ అయ్యారు. రేపటి నుంచి ఆంక్షలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం నేపథ్యంలో తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ కాలం నాటి రాజకీయాలని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి విజయం సాధ్యం కాదు. ప్రజలు గొప్ప విజయాన్ని అందించారని హర్షం వ్యక్తం చేశారు.

ఇక మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ నేతలు చేసిన విమర్శలని సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. విపక్ష నేతల నోళ్లకు మొక్కాలని.. కొన్ని నిరంతరం మొరిగే కుక్కలు ఉన్నాయ్. అవి ఈ ఎన్నికల్లో కూడా బాగానే మొరిగాయని విమర్శించారు. ఒకడైతే ముఖ్యమంత్రిని ముక్కు కోస్తానంటాడు. వాళ్లు జాతీయ పార్టీకి చెందినవాళ్లు. ఇదీ వాళ్ల సంస్కారం అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు చెప్పకుండా విమర్శించారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై సీరియస్ అయ్యారు.

 రాజకీయాలన్నా, రాజకీయ నేతలన్నా ప్రజల్లో అసహ్యం వచ్చేసింది. నేతల బతుకులు కార్టూన్ బతుకులయ్యాయి. మరింత కార్టూన్ బతుకులు కాకూడదనుకుంటే నేతలు ఆలోచించాలి. తిట్టుకోవాలనుకుంటే రేపు సాయంత్రం వరకైనా తిట్టుకోవచ్చు. సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై రేపట్నించి కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సంస్కారం లేకుండా వ్యక్తిగత దూషణలు చేస్తే ఎంతటివారినైనా సహించేది లేదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.