నితీష్ కుమార్’పై ప్రశాంత్ కిషోర్ ఫైర్
ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ జేడీయూ ఉపాధ్యక్షుడు అన్న సంగతి తెలిసిందే. పార్టీలో సీఎం నితీష్ కుమార్ తర్వాతి స్థానం ఆయనదే. ఆయన కాబోయే బీహార్ సీఎం అనే ప్రచారం జరిగింది. స్వయంగా నితీష్ కుమార్ నే ప్రశాంత్ తన వారుసుడు అన్నట్టుగా మాట్లాడారు. ఐతే, ఇప్పుడు వీరిద్దరి మధ్య వివాదాలు నెలకొన్నాయి.
ప్రశాంత్ కిషోర్ ఇష్టం ఉంటే పార్టీలో ఉండొచ్చు. లేదంటే.. వెళ్లిపోవచ్చని సీఎం నితీష్ కుమార్ మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సిఫారసు మేరకే ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ ను జేడీయూలోకి తీసుకున్నామన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్ మండిపడ్డారు.
తనను ఎందుకు పార్టీలోకి చేర్చుకున్నారనే విషయంలో సీఎం నితీష్ కుమార్ ఎంతో దిగజారి అబద్దం చెప్తున్నారని మండిపడ్డారు. అమిత్ షా సిఫారసు చేసిన వ్యక్తి మాటలు సైతం వినే ధైర్యం లేదని నితీశ్‌కు లేదని ఎద్దేవా చేశారు. ఇంతకీ నితీష్-ప్రశాంత్ కిశోర్ లకి ఎక్కడ చెడింది అంటే.. ? జేడీయూ ఎన్డీయే మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అలాంటి బీజేపీపైనే పోరాటం చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు వివాదాస్పద చట్టాలను ప్రశాంత్ కిషోర్ బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలని ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు.. వాటిని వ్యతిరేకిస్తున్న వాళ్లకి మద్దతుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ విధానలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమించారని వారిని అభినందిస్తున్నారు.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో పాగవేయాలని భావిస్తున్న భాజాపాకు ప్రశాంత్ వ్యూహాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ప్రశాంత్ కిషోర్ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్‌కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. హస్తినలో ఆప్ విజయానికి ప్రణాళికలు రచిస్తూ… తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే ఆప్ తరఫున ప్రచార బరిలోనూ దిగుతానని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో బీజేపీ బీహార్ సీఎం నితీష్ కుమార్ ని రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.