మూడో టీ20 : సూపర్ ఓవర్’లో టీమిండియా విన్

హమిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20 నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. సూపర్ ఓవర్ లో టీమిండియా సూపర్ విన్ అయింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.రోహిత్ శర్మ 65, కెప్టెన్ కోహ్లీ 38, కె ఎల్ రాహుల్ 27, అయ్యర్ 17 పరుగులు చేశారు. మనీష్ పాండే 14, జడేజా 10 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. కివీస్ బౌలర్లలో బెనెట్ 3, సాట్నర్, గ్రాండ్ హోమ్ తలో వికెట్ తీశారు.

అనంతరం 180 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి సరిగ్గా 179 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్ కి దారితీసింది. సూపర్ ఓవర్ లో మొదటి బ్యాటింగ్ చేసిన కివీస్ 17 పరుగులు చేసింది. మిలియమ్ సన్, గుప్తిల్  కలిసి సూపర్ ఓవర్ ఆడారు. అనంతరం టీమిండియా తరుపున భారత ఓపెనర్లు రోహిత్, కెఎల్ రాహుల్ లు బ్యాటింగ్ కి దిగారు. తొలి బంతిని ఆడిన రోహిత్ 2 పరుగులు చేశాడు. తర్వాత బంతికి సింగిల్ తీసి రాహుల్ కి ఇచ్చాడు.
 
మూడో బంతికి రాహుల్ ఫోర్ కొట్టి, నాల్గో బంతికి సింగిల్ తీసి రోహిత్ కి ఇచ్చారు. ఇక ఆఖరి రెండు బంతులని రోహిత్ సిక్సర్స్ గా మలచడంతో టీమిండియా గెలుపొందింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ని మరో రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే టీమిండియా గెలిచేసింది.