జనసేనకు జేడీ రాజీనామా
కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది. జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు.
ఈ మేరకు రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పంపారు. పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ విధి విధానాలు నచ్చకనే రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
“పూర్తి జీవితం రాజకీయాలకే అని చెప్పిన పవన్.. తిరిగి సినిమాల్లో నటిస్తుండడం చూస్తుంటే.. ఆయనలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది. అందుకే జనసేన పార్టీ నుండి నిష్క్రమించాలని అనుకుంటున్నాను” జేడీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
గత యేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి ముందు జేడీ జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జేడీ తెదేపాలో చేరేలా కనిపించాడు. ఆఖరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకుని జనసేన గూటికి చేరారు. జనసేన కీలక నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. యేడాది పూర్తికాకుండా జనసేనలో జేడీ జర్నీ ముగిసింది. పార్టీని వీడటానికి జేడీ చెప్పిన కారణమే పెద్దగా అతకడం లేదు. బహుశా.. జనసేన భాజాపాకి దగ్గరవ్వడం ఇష్టం లేకే.. జేడీ జనసేనని వీడారని భావించాలేమో.
ఇక జనసేన పార్టీని వీడినా.. ఇన్నాళ్లు తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా జనసేన సైనికులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు అందుబాటులో ఉంటానని జేడీ తెలిపారు.