టీమిండియా మరో సూపర్ విన్


కోహ్లీ సేన మరో సూపర్ విజయం సాధించింది. న్యూజిలాండ్ తో జరిగిన నాల్గో టీ20లోనూ టీమిండియాకు సూపర్ ఓవర్ తోనే విజయం దక్కింది. భారత్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ కూడా టైగా మారి సూపర్ ఓవర్ కు దారితీసింది.

వాస్తవానికి కివీస్ చాలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఇది. లక్ష్య ఛేదనలో కివీస్ 19 ఓవర్లలో 159/3తో పటిష్టస్థితిలో నిలిచి విజయానికి చేరువైంది. చివరి ఓవర్ లో ఏడు పరుగులు చేస్తే చాలు. అప్పటికే టిమ్ సీఫెర్ట్ (57), రాస్ టేలర్ (24) క్రీజులో పాతుకుపోయారు. ఈ నేపథ్యంలో కివీస్ ఈజీగా గెలిచేస్తోంది అనుకొన్నారు. కానీ, చివరి ఓవర్’లో శార్దూల్ ఠాకుర్ మాయ చేశాడు.

తొలి బంతికి టేలర్ ను బోల్తా కొట్టించాడు. తర్వాతి బంతికి డారిల్ మిచెల్ (4) ఒక బౌండరీ బాదాడు. మూడో బంతికి సీఫెర్ట్ రనౌటయ్యాడు. ఇక నాలుగో బంతికి శాంట్నర్  సింగిల్ తీయగా.. ఐదో బంతికి మిచెల్ ఔటయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా, శాంట్నర్ సింగిల్ తీశాడు. అవతలి వైపున్న బ్యాట్స్  మన్  రెండో పరుగుకు యత్నించడంతో సంజు శాంసన్ త్రో విసిరి రనౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ టై అయింది.

ఇక సూపర్ ఓవర్ వేసిన బుమ్రా ఒక వికెట్ తీసి 13 పరుగులిచ్చాడు. భారత్ తరుపున సూపర్ ఓవర్ ఆడిన కె ఎల్ రాహుల్ తొలి రెండు బంతులను ఒక సిక్స్, ఒక ఫోర్ బాది, మూడో బంతికి భారీ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మిగతా పని పూర్తి చేసి జట్టును గెలిపించాడు. దీంతో  ఐదు టీ20ల సిరీస్ లో భారత్ 4-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆఖరి మ్యాచ్ కూడా టీమిండియా గెలిస్తే.. కివీస్ కి గుండు గీసినట్టే.