నిర్భయ దోషులకి మరోసారి ఉరిశిక్ష వాయిదా.. ఇది కచ్చితంగా మన న్యాయ వ్యవస్థ లోపమే !


నిర్భయ దోషులకి ఉరిశిక్ష ఖరారైన సంగతి తెలిసిందే. తొలిత జనవరి 22న నిర్భయ దోషులని ఉరితీయాలనే తీర్పు వచ్చింది. సాంకేతిక కారణాల వలన అది కాస్త ఫిబ్రవరి 1కి వాయిదా పడింది. రేపు కూడా నిర్భయ దోషులని ఉరితీయడం లేదు. మరోసారి నిర్భయ దోషులకు ఉరి శిక్ష వాయిదా పడింది. ఈ మేరకు పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దోషులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, తమకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నందున స్టే ఇవ్వాలన్న దోషుల వాదనలతో కోర్టు ఏకీభవించింది. పటియాల కోర్టు దీనిపై స్టే ఇవ్వడంతో ఉరి నిలిచిపోయింది. మరోవైపు, దోషులకి ఉరివాయిదా పడతంపై నిర్భయ తల్లి ఆశాదేవి ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయ వ్యవస్థలోని లోపాలను దోషులు ఉపయోగించుకుంటూ ఉరిని తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వాస్తవానికి రేపు (ఫిబ్రవరి1) ఉదయం 6గంటలకి తీహార్ జైలులో నిర్భయ దోషులకి ఉరితీయడం దాదాపు ఖాయం అనుకొన్నారు. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. తలారి తీహార్ జైలుకు గురువారమే చేరుకున్నారు. ఈరోజు ట్రయల్ ఉరికూడా నిర్వహించారు. ఇంతలో పాటియాల కోర్టు నిర్భయ దోషుల ఉరిశిక్షని వాయిదా వేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరీ.. నిర్భయ దోషులకి కొత్త ఉరిశిక్ష తేదిని ఎప్పుడు ప్రకటిస్తారు. నిర్భయ దోషులకి ఈ లోకంలో ఎప్పుడు నూకలు చెల్లుతాయనేది చూడాలి.