కేంద్ర బడ్జెట్’లో తెలంగాణకు అన్యాయం
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రాధాన్యం దక్కలేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాల ఊసేలేదు. కనీసం ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా మంజూరు చేయలేదు. కొనసాగుతున్న ప్రాజెక్టులు, రైల్వేలైన్లకు కూడా ఎలాంటి కేటాయింపులు చేయకపోవడంపై తెలుగు ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం, రైతుబంధు పథకాలకు కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు లేవు. దీనిపై తెరాస ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం, రైతుబంధు పథకాలకు కేటాయింపులు లేవని నామా నాగేశ్వరరావు విమర్శించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారని.. అయితే అది ఎలా చేస్తారో బడ్జెట్ లో వివరించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత దేశాన్ని అన్ని విధాలుగా ఈ బడ్జెట్ ముందుకు తీసుకెళ్తుందని తాము ఆశించామని.. అయితే అందుకు భిన్నంగా కేంద్ర బడ్జెట్ ఉందని విమర్శించారు.
మరోవైపు, ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్రబడ్జెట్ బాగుందని.. ప్రభుత్వం ప్రకటించిన ట్యాక్స్ హాలిడేను ఆహ్వానిస్తున్నామని ఏపీ ఆర్థికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఐతే, ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం నిరాశ పరిచారన్నారు. మొత్తానికి కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకి పెద్దగా కేటాయింపులు జరగలేదు. ఇందుకు కారణం ఎన్నికల సీజన్ కాకపోవడం.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే రాజకీయం చేయకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.