కేంద్ర బడ్జెట్ పై కేసీఆర్ అసంతృప్తి

తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్ర బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనల్లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సీనియర్‌ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈ సమీక్ష జరిగింది. కేంద్రం చేసిన కేటాయింపులు తెలంగాణ పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపనుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

ఈ బడ్జెట్‌ ప్రగతికాముక రాష్ట్రాలను నిరుత్సాహపరిచేలా ఉందని… రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోత విధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. నిధుల కేటాయింపుల విషయంలో తెలంగాణకు వివక్ష చూపిందని మండిపడ్డారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమన్నారు. నిధుల కోత వల్ల రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుందని చెప్పారు. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న పథకాలని కేంద్రం నుంచి సహకారం లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.