అమరావతిపై చేతులెత్తేసిన కేంద్రం
ఏపీ మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్న వారిని కేంద్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఏపీకి మూడు రాజధానులని ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లుని ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు ఆమోదానికి అడ్డుపడిన మండలిని రద్దు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన తీర్మాణాన్ని కేంద్రానికి పంపింది. మరోవైపు, ఏపీ రాజధాని మార్పుని కచ్చితంగా కేంద్రం అడ్డుకుంటుందనే తెదేపా, జనసేన నేతలు ఉన్నారు.
వారి ఆశలని అడియాశలు చేస్తూ మంగళవారం లోక్ సభలో కేంద్ర ఓ ప్రకటన చేసింది. ఏపీ రాజధాని అంశంపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. దాన్ని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. లోక్ సభలో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఈ నేపథ్యంలో ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని ఎవరు అడ్డుకోలేరని క్లారిటీ వచ్చేసింది. కాకపోతే.. కాస్త ఆలస్యం కావొచ్చు. ఆర్నెళ్లు, యేడాది పట్టొచు. కానీ ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటుకావడం మాత్రం పక్కా. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో చట్ట సభలు, కర్నూలులో హైకోర్టుని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.