చిరు-బాలయ్య ఇలా కలిశారు

మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ కలిశారు. సినీ ప్రేక్షకులకి పిక్ ఆఫ్ డే అందించారు. ఇంతకీ చిరు-బాలయ్య ఎక్కడ.. ఏ సందర్భంలో కలిశారో తెలుసా.. ? దర్శకుడు కోడి రామకృష్ణ చిన్న కూతురు వివాహ వేడుకలో. కోడిరామకృష్ణ రెండో కూతురు ప్రవల్లిక వివాహం సి.హెచ్. మహేష్‌తో  ఘ‌నంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి దంపతులు హాజరయ్యారు. బాలయ్య కూడా ఈ వేడుకకి విచ్చేశారు. పక్క పక్కనే కూర్చున్న చిరు-బాలయ్య సరదాగా మాట్లాడుకుంటున్నారు.

దానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుండు లుక్ లో పసుపు రంగు షర్ట్ లో బాలయ్య మెరిసిపోతున్నారు. ఇక కొరటాల సినిమా కోసం మరింత స్లిమ్ గా మారిన చిరు.. పార్టీ వేర్ దుస్తుల్లో మెరిశారు. ఇటీవల చిరు-మోహన్ బాబుల ఆలింగనం ఫోటో ఈ దశాబ్ధం ఆరంభానికి గుర్తిండిపోయే ఫోటో అనిపించుకుంది. ఇప్పుడు చిరు-బాలయ్యల పిక్ కూడా అలాంటిదే అంటున్నారు మెగా, నందమూరి అభిమానులు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జెడ్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.