‘పెళ్లిసందడి’ రికార్డుని బ్రేక్ చేసిన అల.. వైకుంఠపురంలో !


మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అల..వైకుంఠపురములో’. పూజాహెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కలెక్షన్స్‌పరంగా కొన్ని ఏరియాల్లో ‘బాహుబలి’ రికార్డులను కొల్లగొట్టింది. తాజాగా అలనాటి సూపర్ హిట్ ‘పెళ్లిసందడి’ రికార్డుని అల.. బ్రేక్ చేసింది.

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లిసందడి’ ఏ రేంజ్ లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకి, ఆ సినిమాలోని పాటలకి నేటితరం ప్రేక్షకులు కూడా పెద్ద అభిమానులు. 1996లో వచ్చిన పెళ్లిసందడి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్స్ లో ఏకదాటిగా 232రోజులు ఆడి 98లక్షలు వసూలు చేసింది. ఇప్పటికీ సంద్యలో అదే రికార్డు. ఇప్పుడీ రికార్డుని అల.. బ్రేక్ చేసింది. కేవలం 29రోజుల్లోనే సంధ్య థియేటర్ లో అల.. కోటి రూపాయలు వసూలు చేసింది. ఇది నిజంగా బన్నీ అభిమానులు గర్వంగా ఫీలయ్యే న్యూస్.