ఛాలెంజ్ చేసి మరీ.. ఫోర్ కొట్టిన సచిన్
బుష్‌ఫైర్ బాధితుల సహాయార్థం రికీ పాంటింగ్ ఎలెవన్ × గిల్‌క్రిస్ట్ ఎలెవన్ జట్ల మధ్య ‘బిగ్ బాష్ ఫైర్’ మ్యాచ్ జరిగింది. పాంటింగ్ జట్టుకు సచిన్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. గిల్‌క్రిస్ట్ ఎలెవన్‌పై పాంటింగ్ ఎలెవన్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాంటింగ్ సేన నిర్ణీత 10 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన గిల్లీ సేన ఆరు వికెట్లు కోల్పోయి 103 పరుగులే చేసింది.
ఐతే, ఈ మ్యాచ్ సందర్భంగా.. ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ ఎలీస్ పెర్రీ సచిన్‌కు సరదాగా ఛాలెంజ్ విసిరింది. ఈ మ్యాచ్ ఇన్నింగ్స్ విరామంలో తన బౌలింగ్‌ను ఎదుర్కోవాలని సవాల్ చేసింది. దీనికి సచిన్ ఓకే చెప్పేశాడు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాంటింగ్ జట్టు బ్యాటింగ్ ముగిసిన తర్వాత పసుపు రంగు జెర్సీ ధరించి సచిన్ మైదానంలో అడుగుపెట్టాడు. ఎదుర్కొన్న తొలి బంతినే ఫైన్‌లెగ్ మీదుగా బౌండరీకి తరలించాడు. తర్వాతి బంతుల్ని డీప్ స్వేర్ లెగ్, షార్ట్ ఫైన్ లెగ్, మిడ్ ఆన్, కవర్స్ మీదుగా చూడముచ్చటైన షాట్స్‌తో అలరించాడు.