ఏపీలో ఉపఎన్నిక… !?
ఏపీలో ఎమ్మెల్సీ పదవిపై అధికార పార్టీలో రాజకీయం వేడెక్కింది. శిల్పా చక్రపాణి రాజీనామా చేయడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. శనివారం మంత్రి వర్గ సమావేశం తరువాత ఈ అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కళావెంకట్రావుతో సమావేశమై ఈ విషయంపై చంద్రబాబు చర్చించి సూచనలు చేస్తారు.
కర్నూలు జిల్లా నేతలతో సమావేశమై వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించనున్నారు. మంత్రి వర్గ సమావేశం తరువాత ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం తరువాత అభ్యర్థి ఎవరు అనేదానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 19న నోటిఫికేషన్ వెలువడనుందని తెలుస్తోంది.
అయితే ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. పాత, కొత్త నేతలు తమ విధేయతను చాటుకుని టిక్కెట్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా శిల్పా చక్రపాణి వైసీపీలోకి వెళ్లిన నేపథ్యంలో.. ఈసారి అలాంటి పరిస్థితి మళ్లీ రిపీట్ కాకుండా అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.