పవన్ కర్నూలు పర్యటన.. అడ్డంకులు తప్పవా ?
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రెండ్రోజుల కర్నూలు పర్యటన నేటితో మొదలు కానుంది. విద్యార్థిని సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో నిర్వహించే ర్యాలీ, బహిరంగ సభలో పవన్ పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3గంటలకు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో జనసేన నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు పాల్గొననున్నారు.
ఈ ర్యాలీ కోట్ల కూడలిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అలాగే రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూలు, ఎమ్మిగనూరులో నిర్వహించే కార్యక్రమాల్లో పవన్ పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. ఇక, విద్యార్థిని అనుమానాస్పద మృతి విషయంలో పవన్ పోరాటం ప్రారంభించడానికి సరిగ్గా ఒకరోజు ముందే పోలీసులు దీనిపై స్పందించారు. అటు సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ అంశం కేంద్ర హోంశాఖ పరిశీలనలో ఉందని పోలీసులు తెలిపారు.
మరోవైపు, పవన్ కర్నూలు పర్యటని అడ్డుకుంటామని రాయలసీమ విద్యార్థి సంఘాలు అంటున్నాయి. రాయలసీమకి హైకోర్టు కేటాయించడాన్ని పవన్ వ్యతిరేకించారని.. ఆయనకి రాయలసీమలో పర్యటించే నైతిక హక్కు లేదని విద్యార్థులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పవన్ మాట్లాడుతూ.. కర్నూలులోనే రాజధాని ఉండాలి అన్నారు. ఇప్పుడేమో.. కర్నూలుకి హైకోర్టు వస్తుందంటే వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కర్నూలు పర్యటనని అడ్డుకుంటామని విద్యార్థులు అంటున్నారు.